ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను సమష్టిగా సక్సెస్ చేద్దాం : మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను సమష్టిగా సక్సెస్ చేద్దాం :  మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
  • పని చేయకుంటే పనిష్మెంట్ తప్పదు: మంత్రి పొన్నం

కరీంనగర్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో 99 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సక్సెస్​ చేద్దామని మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు పిలుపునిచ్చారు. కరీంనగర్  కలెక్టరేట్ లో శుక్రవారం సాయంత్రం ఉమ్మడి జిల్లా ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్  ఆది శ్రీనివాస్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, అడిషనల్ కలెక్టర్లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఇరిగేషన్, ఆర్అండ్ బీకి సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రధాన సమస్యలను పరిష్కరించడంతో పాటు రెండున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరికీ అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి రూ.లక్ష కోట్లు బడ్జెట్  కేటాయించిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్  మాట్లాడుతూ ప్రగతి ప్రణాళికను పల్లెపల్లెకు, వాడవాడకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆఫీసర్లు ఉదాసీనంగా ఉండొద్దని, 99 రోజుల తర్వాత పనిచేసిన వారికి ప్రశంసలు ఉంటాయని, పనిచేయని వారికి పనిష్మెంట్  తప్పదని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ ప్రోగ్రామ్​ను రాజకీయాలకతీతంగా సక్సెస్​ చేయాలని పిలుపునిచ్చారు.

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా కాంగ్రెస్  ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ప్రజాపాలన–-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పల్లెల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములై సక్సెస్​ చేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లాలో మానవ వనరుల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఆది శ్రీనివాస్  మాట్లాడుతూ రెండున్నరేళ్లలో ప్రభుత్వం అనేక విజయాలు సొంతం చేసుకుందని తెలిపారు. కరీంనగర్  ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, కల్వకుంట్ల సంజయ్, ఎం. సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్  మేయర్  కొలగాని శ్రీనివాస్, రామగుండం మేయర్  మహంకాళి స్వామి, లైబ్రరీ చైర్మన్  సత్తు మల్లేశ్​ పాల్గొన్నారు. 

అధికారులు నిబద్ధతతో పనిచేయాలి: మంత్రి జూపల్లి

ఆదిలాబాద్: ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అధికారులు నిబద్ధతతో పని చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. ఆదిలాబాద్  కలెక్టర్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. పారదర్శకత, జవాబుదారీతనంతో పని చేసి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెంచాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని, భూ సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని బాసర సరస్వతీ ఆలయంలో సేవలన్నీ ఆన్ లైన్ లో అందుబాటులోకి తేవాలని సూచించారు. బాసర ట్రిపుల్  ఐటీలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే పాయల్  శంకర్  మాట్లాడుతూ ఆదిలాబాద్  మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తున్నారని, రూ. 20 కోట్ల భూములు కబ్జాకు గురైనా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. గిరిజనులను ఇబ్బందులు పెడితే ఊరుకోమని, తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.

అనంతరం ఇందిరమ్మ ఇండ్ల మంజూరైన ధ్రువపత్రాలను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఆదిలాబాద్‌‌‌‌లో 4.90 కోట్లతో నిర్మించిన సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల భవనం ప్రారంభించారు. మహాలక్ష్మివాడలో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్నారు. కలెక్టర్  రాజర్షి షా, ఎస్పీ అఖిల్  మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్  మర్మాట్, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్  శంకర్, అనిల్  జాదవ్, వెడ్మ బొజ్జు, మున్సిపల్  చైర్ పర్సన్  అనూష పాల్గొన్నారు.

అంతకుముందు నేరడిగొండ మండల కేంద్రంలోని పీహెచ్ సీ లో నిర్వహించిన స్పెషలిస్ట్  మెడికల్  క్యాంప్ ను మంత్రి ప్రారంభించారు. ఆయన వెంట మాజీ మంత్రి వేణుగోపాల చారి, రిమ్స్  డైరెక్టర్  రాథోడ్  జై సింగ్, డీఎంహెచ్ వో నరేందర్, కాంగ్రెస్  నియోజకవర్గ ఇన్ చార్జీలు గజేందర్, శ్రీహరి రావు పాల్గొన్నారు.

ప్రజల్లోకి వెళ్లాలి: మంత్రి సీతక్క

నిజామాబాద్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో మరో ప్రతిష్టాత్మక ప్రోగ్రాం ప్రారంభించిందని మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం నిజామాబాద్​ కలెక్టరేట్​లో ఆమె ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. ఆఫీసర్స్​లో మరింత జవాబుదారీతనం పెంచుతామన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కలుపుకొని ముందుకెళ్లాలని సూచించారు.

మూడు నెలల్లో విద్య, వైద్యం, అంగన్​వాడీ, స్త్రీ శిశు సంక్షేమం, శానిటేషన్​లో స్పష్టమైన మార్పు కనబడాలన్నారు. గవర్నమెంట్​ సలహాదారులు సుదర్శన్​రెడ్డి, షబ్బీర్​అలీ, రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్​ తాహెర్, కలెక్టర్  ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య, కామారెడ్డి ఎస్పీ రాజేశ్​చంద్ర, మేయర్​ ఉమారాణి పాల్గొన్నారు.